top of page

రాగి చెంబులో చేప పిల్ల

సుబ్బమ్మగారు పండు ముత్తైదువు. డెబ్భై ఏళ్ళు దాటుతున్నా కాయబారు మనిషి. నడుం వంగలేదు, చూపు తగ్గలేదు. 

నిప్పుల మీద నీళ్లు చల్లేటంత ఆచారం. నిప్పుతో నీళ్ళని శుద్ధి చేసేటంత వీరమడి. ఈ ముక్క మాటవరసకనడంలేదు. సుబ్బమ్మగారింట్లో నీళ్లగాబు చూస్తే అక్కడ బొగ్గులు తేల్తూ కన్పిస్తాయి. వొడ్డిర వాళ్ళు కృష్ణ నుంచి తీసుకొచ్చి పోసిన నీళ్లు కనుక మండుతున్న కట్టెపేడు ఒకటి తీసుకెళ్లి ఆ గాబులో ముంచుతుంది.  అప్పుడు ఆ నీళ్లు శుద్ధి అయినట్టు.

అలా శుద్ధి అయిన నీళ్లతో కల్లాపు జల్లి, ముగ్గు వేసి ఆ పైన వంటిల్లు అలుక్కుని పొయ్యి అలికి అక్కడ మళ్ళీ ముగ్గు వేసి కృష్ణకి స్నానానికి బయలుదేరేప్పటికి తొమ్మిదవుతుంది. కావిళ్ళతో నీళ్లు తెచ్చేవాళ్ళకి దూరంగా నడుస్తూ దోవలో కావమ్మగారింట్లో కరివేపాకడిగి రామయ్యగారి దొడ్డి దగ్గర కొచ్చేసరికి రామయ్యగారి కర్రి ఆవు సుబ్బమ్మగార్ని చూసి బుసలు కొడ్తుంది.

సుబ్బమ్మగారికి ఆ ఆవంటే గొప్ప భక్తి. అదేం ఖర్మమో! ఆ ఆవు ఈవిణ్ణి చూడ్డం ఆలస్యం, కొమ్ములు విరుస్తూ పలుపు తెంపుకోబోతుంది. సుబ్బమ్మగారు చిన్నబుచ్చుకున్న ముఖంతో, బతిమిలాడుతూ , "మా అమ్మ కదూ! మా తల్లి కదూ! మా పార్వతీదేవి కదూ! అమ్మా! అమ్మా!" అంటూ ప్రార్ధిస్తుంది. ఉహుఁ! ఆ ఆవు వినదు. రుసరుసలాడుతూ కదం తొక్కుతుంది. ఇక లాభం లేదని రామయ్య గారి పాలేర్ని పిలిచి పలుపు పట్టుకోమని సుబ్బమ్మగారు ఆవు వెనక్కు వెళ్లి ఆవు పంచితం తల మీద చల్లుకుని దణ్ణం పెట్టుకుని కృష్ణ రేవులో కొచ్చేసరికి పది గంటలవుతుంది. బట్టలుతుక్కుని స్నానానికి నీళ్లలోకి దిగే సరికి మరో గంట. సుబ్బమ్మగారి స్నానమయ్యే సరికి సూర్యుడస్తమిస్తాడని వాడుక.

ఆవిడ స్నానం చూడవలసిందే!  ఎన్ని వందల సార్లు నీళ్లలో మునుగుతుందో చెప్పలేము. ఒక్కొక్క దేవుడి పేరున ఒక్కో మునక. దిక్కు దిక్కుకూ తిరిగి వందనాలు, ప్రదక్షిణాలు. పేరు పేరునా అర్ఘ్యాలు. అలా మునిగి మునిగి ఉతికిన బట్టలు భుజాన వేసుకొని బిందెతో నీళ్లు ముంచుకుని వొడ్డుకి పదడుగులు వేసేదో లేదో ఆ బిందెడు నీళ్లు పారబోసేది. కారణం ఏవీ లేదు. ఏ ఉప్పర సరవయ్యో ఎదురుగా వచ్చేవాడు అంతే. మళ్ళీ కృష్ణలో మునిగి నీళ్లు ముంచుకు పైకొచ్చి, అన్నం మెతుకు కాలి కింద పడిందని మళ్ళీ నీళ్లు పారబోసేది. మళ్ళీ మునక. మళ్ళీ నీళ్ల బిందె. వస్తుంటే చింతచెట్టు మీంచి కొంగ రెట్ట వేసిందేమో అన్న అనుమానం కొద్దీ మళ్ళీ నీళ్లు పారబోసేది. ఇలా పారబోసిన నీళ్లతో రేవు రేవంతా బురదయ్యేది. అనేక గండాలు తప్పించుకుంటూ మంచి నీళ్ల బిందె ఇంటికి చేరటానికి గంట పైగా పట్టేది.

పన్నెండు గంటలు దాటుతున్న వేళ పొయ్యి రాజేసేది. నడుస్తున్నా నేలంతా మడి నీళ్లు చల్లుకుంటూ వండుతున్న ప్రతి వస్తువు మీద మడి నీళ్లు చిలకరిస్తూ వంట సాగించేది. సుబ్బమ్మ గారి భర్త సత్యనారాయణగారు పిల్లలకి పాఠాలు చెప్పి చెప్పి ఆకలి లోపల ఉరకలు వేస్తుంటే నీరసంగా స్తంభానికి ఆనుకుని కూర్చునేవాడు. ఎంత సేపటికీ వంటింట్లోంచి పిలుపు రాదు. కాసేపు వంటింటి వైపు కాసేపు చూర్లో పిచ్చికల వైపు చూస్తూ నిముషాలు లెక్కపెడ్తుండేవాడు.

ఒంటిగంట ఒంటిగంటన్నరకు వంటవగా, అప్పుడు దొడ్లో తులసికోట దగ్గర పూజ ప్రారంభించేది సుబ్బమ్మగారు. తులసెమ్మకు నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేసి స్తంభానికంటుకుపోయిన భర్తనుద్దేశించి , "స్నానానికి లేవండి" అనేది. సత్యనారాయణగారు ఆ పిలుపందుకుని చెంగున లేచి గాబులో నీళ్లు నాలుగు చెంబులు నెత్తిన గుమ్మరించుకుని ధావళీ కట్టుకుని పీట మీద వాలేవాడు. ఆయన భోజనం అయ్యేక తను వడ్డించుకుని తిని ఎంగిళ్లెత్తి సుబ్బమ్మగారు మైల పడేసరికి మూడు దాటేది. 

అలా ఒక రోజున భోజనం ముగించుకొని వరండాలో పీట తలకింద పెట్టుకుని సుబ్బమ్మగారు చెంగు వాల్చుకు పడుకుంటే ఆవిడకి ఉన్నట్టుండి దాహమేసింది. మొదట్లో లేవడానికి బద్దకించి అలాగే పడుకుంది. ఆ రోజున పండు మిరపకాయల కారంలో నెయ్యి ఎక్కువేసు కుందేమో దాహం ఆగలేదు. లేచి వంటింట్లోకెళ్ళి రాగి చెంబుతో నీళ్లు ముంచుకొని సగం తాగి చెంబులోకి చూస్తే - ఇంకేముంది?  కొంప మునిగింది, 'శివాశివా!' అంటూ చెంబు వొదిలేసి తనూ పడిపోయింది. ఆ మోతకి నిద్రపోతున్న సత్యనారాయణగారు ఉలిక్కిపడి లేచి పరుగెత్తుకొచ్చారు .

చూస్తే - ఆ రాగిచెంబు నీళ్లలో అడుగున చేప పిల్ల!

తలుపానుకుని, చెంగు కళ్ళకడ్డం పెట్టుకుని కుమిలిపోతోంది సుబ్బమ్మగారు. 

"ఆ నీళ్లతోనే అన్నం వండింది. ఆ నీళ్లతోనే పప్పు చేసింది. ఆ నీళ్లతోనే పచ్చడి నూరింది. ఆ నీళ్లతోటే దేవుడికి నైవేద్యం పెట్టింది. అవే తాగింది. అట్లా తన మడి మండి పోయింది ...", కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది సుబ్బమ్మగారు.

అలా ఏడుస్తున్న సుబ్బమ్మగార్ని చూసి సత్యనారాయణగారన్నారు.  "పిచ్చిదానా! నువ్వు స్నానం చేసే కృష్ణలో చేపలు లేవా ? వొడ్డిర సవరాయి మైలా? నువ్వు తినే అన్నం కాలికి తగిల్తే మైలా? నీ లోపల మైల లేదా?" 

సుబ్బమ్మగారు కళ్ళెత్తి చూసింది. ఎవర్నీ అంటకుండా మడిగా ముత్యపు చిప్పలో ముత్యంలా బతకాలనుకుంది. నీళ్లలో చేపలా బతకాలని తెలిసింది కాదు.

అందుకేనేమో రామయ్యగారి కర్రి ఆవు తనని చూస్తే పొడవటానికి వస్తుంది.

***

bottom of page